ప్రజల విజ్ఞప్తికి ఫలితం. సత్యనారాయణపురం పీహెచ్‌సీకి తిరిగి 108 అంబులెన్స్ కేటాయింపు.
చర్ల జులై 02 మీ వార్త ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) 108 అంబులెన్స్‌ను జిల్లా యంత్రాంగం తిరిగి కేటాయించింది. ఇటీవల ఈ అంబులెన్స్‌ను చర్ల పీహెచ్‌సీకి తరలించడంతో చుట్టుపక్కల గిరిజన, గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యవసర వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్.కొత్తగూడెం గ్రామస్తులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన జిల్లా కలెక్టర్, సత్యనారాయణపురం పీహెచ్‌సీకి 108 అంబులెన్స్ (టీజీ 08 టీ 4821) ను పునరుద్ధరించారు.
అంబులెన్స్ లేకపోవడంతో గర్భిణులు, పాముకాటు బాధితులు, గుండెపోటు రోగులు, ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో తీవ్ర సమస్యలు తలెత్తి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్.కొత్తగూడెం సర్పంచ్ తుర్రం రవికుమార్, దానవాయిపేట వార్డు సభ్యురాలు కణితి రజిని, రుంజ రాజా తదితరులు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వోకు వినతిపత్రం సమర్పించారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. అంబులెన్స్ తిరిగి రావడంతో సత్యనారాయణపురం సర్పంచ్ చిక్కాల గౌతమి, కలివేరు సర్పంచ్ తెల్లం లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.కొత్తగూడెం సర్పంచ్ తుర్రం రవికుమార్, సత్యనారాయణపురం సర్పంచ్ చిక్కాల గౌతమి, కలివేరు సర్పంచ్ తెల్లం లక్ష్మణ్, వార్డు సభ్యురాలు కణితి రజిని, కణితి సోనీ, చరపా విజయ్ కుమార్, హెచ్ఈఓ బాబురావు, ఎల్టీఈ రామకృష్ణ, హెచ్వీ తిరుపతమ్మ, అనసూర్య, పద్మ, సిబ్బంది సత్యనారాయణ, దానవాయిపేట రుంజ రాజా, కారం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

