భద్రాచలం చుట్టుపక్కల ఏపీలో విలీనమైన 5 గ్రామపంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలి: పొదెం వీరయ్య.
భద్రాచలం పట్టణం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య కేంద్ర మంత్రిని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భద్రాచలం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు విచ్చేసిన సందర్భంగా, బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామపంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల భద్రాచలం పట్టణం భౌగోళికంగా, పరిపాలనా పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. భద్రాచలం పట్టణానికి అనుబంధంగా ఉన్న గ్రామాలు మరో రాష్ట్రంలో ఉండటంతో ప్రజలు నిత్యావసర పరిపాలనా సేవల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ ఐదు గ్రామపంచాయతీల విలీనం కారణంగా చెత్త డంపింగ్‌కు సరైన స్థలం లేక గోదావరి నదిలో వ్యర్థాలు పడవేయాల్సిన పరిస్థితి, విద్యా సంస్థల ఏర్పాటులో ఇబ్బందులు, భద్రాచలంలో శ్మశాన వాటిక/బరియల్ గ్రౌండ్‌కు స్థలం కొరత, పర్ణశాల వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు రాకపోకల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన సుమారు 900 ఎకరాల భూమి ఐదు గ్రామపంచాయతీల విలీనం కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో దేవస్థానం భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కష్టతరంగా మారిందని తెలిపారు. దేవస్థాన భూములపై ఆక్రమణలు జరుగుతున్నా, పరిపాలనా పరిధి మరో రాష్ట్రంలో ఉండటంతో వాటిని అరికట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర మంత్రికి వివరించారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పొదెం వీరయ్య కేంద్ర మంత్రిని కోరారు.
కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి, భద్రాచలం ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నట్లు పొదెం వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమం లో వీరయ్య తో భద్రాచలం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు తమ్మల్ల వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి సాంబశివరావు, కొలపూడి వరుణ్, కాపుల శ్రీను తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

