
- రెండేళ్ల తర్వాత వైజాగ్‌లో అంతర్జాతీయ మ్యాచ్
- 2026లో భారత్, న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్
- సిరీస్‌లోని నాలుగో టీ20కి విశాఖపట్నం ఆతిథ్యం
ఆంధ్రప్రదేశ్ లోని క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విశాఖపట్నం వాసులకు శుభవార్త.. త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జరగనుంది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో నాలుగవ టీ20 మ్యాచ్ కు విశాఖపట్నం వేదిక కానున్నట్లు సమాచారం.
2026 జనవరి 21 నుంచి జనవరి 31 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగవ టీ20 మ్యాచ్‌ను జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక క్రికెట్ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లేదా వైజాగ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు పెద్దగా జరగకపోవడం, కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లకే పరిమితం కావడంతో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే, ఈ సిరీస్ కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి చోటు దక్కలేదని తెలుస్తోంది. కేవలం విశాఖపట్నంలో మాత్రమే ఒక టీ20 మ్యాచ్ జరగనుండగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌లను నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువహటి మరియు తిరువనంతపురం నగరాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో, మ్యాచ్ టికెట్ల కోసం ఇప్పటినుంచే సిద్ధం కావాలంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.