అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటన.. ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదాలు నింపింది. ప్రమాద సమయంలో 230 ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు సజీవంగా బయటపడి మృత్యుంజయుడయ్యాడు. విమాన ప్రయాణికులు సజీవ దహనమైపోవటంతో పాటు విమానం కూలిన భవనంలోని వాళ్లు ప్రాణాలు కోల్పోవటం.. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే..
ఈ దుర్ఘటనలో కన్నీటి కథలు.. ఎన్నో భావోద్వేగ గాథలు వెలుగుచూస్తూ గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. విమాన ప్రమాదం జరిగిన స్థలంలో భగవద్గీత దొరికిందని.. విమానం మొత్తం కాలిబూడిదైనా ఆ పుస్తకం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి . అయితే.. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి మనుషులంతా కాలి సజీవ దహనమైతే.. భగవద్గీత మాత్రం కాలిపోకుండా ఎలా ఉంది అనే కుతూహలం ఒకవైపు వ్యక్తమవుతుంటే.. మరోవైపు, అసలు ఆ భగవద్గీత ఎవరిదీ..? ఫ్లైట్‌లో ఎందుకుంది..? అని ప్రశ్నలు మొదలయ్యాయి సాగర్ అమీన్ అనే వలంటీర్ విమాన ప్రమాదం గురైన స్థలంలో శిథిలాల తొలగింపు జరుగుతుండగా ఆ భగవద్గీతను కనిపెట్టారు. ఈలోపు.. ఆ గ్రంథం ఎవరనేదానిపై రకరకాల కథనాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ భగవద్గీత జయశ్రీ పటేల్(27)కు చెందిందన్నది ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ కథన సారాంశం. అందులోని వివరాల ప్రకారం.. గుజరాత్ ఆరావళి జిల్లా కంభిసర్‌కు చెందిన జయశ్రీ పటేల్ శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు. ఎప్పుడూ ఆమె తన వెంట కృష్ణుడి చిన్న విగ్రహం, భగవద్గీతను తీసుకెళ్తుందట. ఈ ఏడాది జనవరిలో ఆమెకు వివాహం అయ్యింది. భర్త లండన్‌లో ఉద్యోగం. దీంతో ఆమె అక్కడికి బయల్దేరింది. అలా వివాహం అయిన మొదటిసారి.. ఆమె ప్రయాణంలోనూ వాటిని తీసుకెళ్లిందని, ప్రమాదంలో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పినట్లు ఆ ఆంగ్ల మీడియా కథనం ఇచ్చింది. మరోవైపు ఆ భగవద్గీత ఓ ఎయిర్‌హోస్టెస్‌దంటూ మరో కథనం వైరల్ అవుతోంది.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.