ఖమ్మం: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, ఏదులాపురం, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి(సోమవారం) కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీపై స్పష్టతనిస్తామని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని.. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని.. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలంటూ ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తాం. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది. రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని.. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తాం. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి’’ అని పొంగులేటి చెప్పారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.